ఓల్గా

తెలుగు సాహిత్యం పై మాట్లాడాలనుకుంటే ఎక్కువ శ్రమ అవసరం ఉండదు. ఎంచుకోవడం తేలిక. తెలుగు రచయిత్రుల గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే, ఎంచుకునేందుకు మనకి అందుబాటులో ఉన్న పేర్లు చాలా పరిమితమైనవి. ఈ విషయం నాకూ ఈ మధ్యనే అర్థమైంది, ఈ వేదిక కోసం కసరత్తు ప్రారంభించిన తరువాత. ఇందులోని హాస్య కోణాన్ని చూడగలిగితే అది క్రీడా స్ఫూర్తి అవుతుంది. దీని మూలాలను వెతికి పట్టుకోగలిగితే ఇందులో ఒక సామాజిక పాఠం దొరుకుతుంది. రచయిత్రులు అల్ప సంఖ్య లో ఉండడానికి కారణం దక్షత లోపమా లేక దాష్టీకమా అనే ప్రశ్నకు సమాధానం కోసం పెద్ద మేధో మధనం అవసరం లేదు. ఇది అందరికీ అర్థమయ్యే విషయమే.
ఈ వేదిక ఉద్దేశ్యాల నేపథ్యంలో ఇప్పటి వరకు నేను ప్రస్తావించిన పురుషాధిక్య సమాజం వగైరా విషయాలు అసందర్భమేమో అనే సందేహం మీలో కలిగే ఆస్కారం ఉంది.  కానీ సందర్భం ఉంది. ఇది 2019వ సంవత్సరం. మనం ఇప్పుడు అనుకున్న మాట ఈ రోజు సంగతి. మరి 2019 లో పరిస్థితి ఇలా ఉంటే, మూడు, నాలుగు దశాబ్దాల క్రితం పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? ఆ పరిస్థితిని ఊహిస్తే, అప్పటి రచయిత్రులు ఎటువంటి సవాళ్లు ఎదుర్కొని ఉంటారు? ఆ సవాళ్ళ నేపథ్యం లో ఎటువంటి ఇతివృత్తాలను ఎంచుకుని ఉంటారు? అప్పట్లో ప్రజాదరణ విశేషంగా పొందిన రచయిత్రుల నవలలు చాలా పెద్ద సంఖ్యలో చలన చిత్రాల రూపం దాల్చడం, అవి కూడా ఘన విజయాలు సాధించడం దేనికి సంకేతం? చలన చిత్ర రంగం లో పేరు తెచ్చుకున్న రచయితలు కూడా ఉన్నారు, కానీ ఈ ధోరణికి బీజాలు వేసింది రచయిత్రులే, ప్రధానంగా స్వర్గీయ యద్దనపూడి సులోచనా రాణి గారిని ఈ విషయంలో ప్రశసించి తీరాలి. ఇంకొంచెం లోతుగా విశ్లేషిస్తే కొన్ని కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి.
ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే క్రమంలో మనకు స్పష్టమయ్యే విషయమేమిటంటే, రచయిత్రులలో అధిక సంఖ్యాకులు సనాతన భావజాలం ఏర్పరచిన చట్రం నుంచి బయటికొచ్చే సాహసం చేయలేదు, దానికి కారణం వారి దృక్పథం కూడా అదే చట్రానికి లోబడి ఉండడం కావచ్చు, లేదా వ్యాపార పరమైన అంశాలు కావచ్చు, లేదా విమర్శకుల దాడులకు ఆస్కారం ఇవ్వడం ఎందుకులే అనే ముందు జాగ్రత్త వల్ల కావచ్చు. పాశ్చాత్య సమాజాలలో ఇటువంటి చైతన్యం 20వ శతాబ్దపు తొలినాళ్ళలోనే మొదలైంది. కానీ ఆ ప్రకంపనలు మనవరకూ వ్యాపించడానికి అర్ధ శతాబ్దం పైనే పట్టింది. 1980లలో మనకున్న దేశ, కాల పరిస్థితులూ, సామాజిక వాస్తవాలకు ఎదురీది అకస్మాత్తుగా ఒక పెనుతుఫాను సృష్టించిన ఒక రచయిత్రి గురించి నా అభిప్రాయాలను ఈ రోజు మీతో పంచుకోవడం, కేవలం ఒక మంచి అవకాశం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రక అవసరం అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఆలోచనలు మన రాష్ట్రం, దేశం పరిధులు దాటి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేశాయి, అందులో తెలుగు వారితో బాటు ఇతర భాషల వారూ ఉన్నారు. కేవలం సాహితీ ప్రియులే కాక, సామాజిక తత్వవేత్తలు కూడా నిశ్శబ్దాన్ని వీడి ఒక అనూహ్యమైన చర్చకు సిద్ధపడవలసిన ప్రశ్నలను తెరపైకి
తెచ్చిన ఆ స్త్రీమూర్తి పేరు పోపూరి లలిత కుమారి. అయితే ఈ పేరు సాహితీ రంగంతో పరిచయం ఉన్నవారిలో కూడా చాలా మంది తక్షణం గుర్తించగలిగేది కాదు. కానీ ఓల్గా అంటే గుర్తుపట్టని వాళ్ళు మాత్రం దాదాపుగా ఉండరు. ఆమె గురించి మరిన్ని విషయాలు ప్రస్తావించే ముందు, ఆవిడ జీవిత విశేషాలనూ, సాహితీ ప్రస్థానాన్నీ క్లుప్తంగా అవలోకనం చేద్దాం. ఓల్గా జన్మస్థలం గుంటూరు. 1950 నవంబర్ 27న జన్మించారు. 1972 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగు భాష, సాహిత్యాలపై స్నాతకోత్తర పట్టా పొందారు. 1973 నుండి 86 వరకు 13 సంవత్సరాలపాటు తెనాలి వి.ఎస్.ఆర్., ఎన్.వి.ఆర్. కళాశాలలో అధ్యాపకురాలిగా సేవలందించారు. అనంతరం 1995 వరకు ఉషాకిరణ్ సంస్థలో చలన చిత్ర నిర్మాణ రంగంలో, కథా రచనా విభాగానికి నేతృత్వం వహించారు. 1991 నుండి తెలంగాణకు చెందిన సామాజిక సేవా సంస్థ ‘అస్మిత’ లో చురుకుగా పనిచేస్తున్నారు, ప్రస్తుతం ఆ సంస్థ అధ్యక్ష స్థానంలో ఉన్నారు, అస్మిత వెలువరిస్తున్న ‘వంటింటి మసి’ అనే ప్రచురణకు మార్గదర్శకత్వం చేస్తున్నారు, ఇంకా, ఆమె జాతీయ పుస్తక పరిషత్తుకు సలహాదారు కూడా. ఆమె రచనలు 1987లో ‘స్వేచ్ఛ’, 1990లో ‘ఆకాశం లో సగం’ ఉత్తమ నవలలు గా ఎంపికయ్యాయి. 1998లో ‘తోడు’ ఉత్తమ కథగా నంది పురస్కారం పొందింది. 1999 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి గా సన్మానాన్ని అందుకున్నారు. 2009 లో సుశీల-నారాయణ రెడ్డి పురస్కారం, 2013లో కందుకూరి వీరేశలింగం సాహితీ పురస్కారం, 2014లో లోక్ నాయక్ పురస్కారం పొందారు. 2015లో ఓల్గా కథా సంపుటి ‘విముక్త’ కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పరిషత్ పురస్కారం లభించింది. అతడు-ఆమె-మనం, సహజ, కన్నీటి కెరటాల వెన్నెల, మాకు గోడలు లేవు, గులాబీలు, చైత్ర స్వరాలు ఓల్గా రచనా పటిమకు మరి కొన్ని మచ్చుతునకలు. ఆమె రచనలలో కథలున్నాయి, నవలలున్నాయి, నాటికలున్నాయి, చలన చిత్ర కథలున్నాయి, కవితలున్నాయి, అనువాదాలున్నాయి, పరిశోధనా పత్రాలున్నాయి, ఇది ఆమె విద్వత్తుకు, విస్తారమైన ఆలోచనా పరిధికీ ప్రబల తార్కాణం.
ఇవి అందరికీ తెలిసిన విషయాలు. కేవలం భౌతిక విశేషాలు. ఓల్గా ఆలోచనల ఉప్పెన సృష్టించిన విధ్వసం గురించి అర్థం కావాలంటే ఆమె రచనల ద్వారా గోచరించే వ్యక్తిత్వాన్ని పరికించి, పరిశీలించాలి. ఓల్గా ను కేవలం ఒక కవయిత్రి గానో, రచయిత్రిగానో, స్త్రీవాదిగానో  మాత్రమే పరిచయం చేయడమంటే అది ఒక విధంగా ఆమె ఆవిష్కరించిన సామాజిక విప్లవాన్ని తక్కువ చేసి చూపడం అని నా భావన. స్త్రీవాదాన్ని బలపరిచే రచనలు చేయడం అనేది ప్రధాన ప్రాతిపదిక అయితే, ఓల్గా కంటే ముందే ఆ చైతన్యం ఉంది. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు వంటి వారు అప్పటికే ఆ దిశగా బలమైన ముద్ర వేశారు. కానీ ఓల్గా ఒరవడి లో ఒక ముఖ్యమైన భేదాన్ని మనం గమనించాలి. ఓల్గా రచనలలో మార్క్సిస్ట్ భావజాలం, కమ్యూనిజం ప్రభావం, అంతర్జాతీయ స్త్రీవాద ధోరణులూ కనిపిస్తాయనడంలో సందేహమేమీ లేదు, కానీ వీటిని అధిగమిస్తూ ఒక మానవీయ కోణం ఉండడం ఓల్గాను ఇతర స్త్రీవాదుల నుంచి వేరు చేసే అంశం. స్థూలంగా చెప్పాలంటే, రంగనాయకమ్మ గారి రచనలలో మార్క్సిజం పునాదిగా స్త్రీల హక్కులపై చర్చ నిర్మాణమవుతుంది, కానీ ఓల్గా స్వరం లో గతి తార్కిక భౌతిక వాదం కేవలం ఛాయామాత్రంగా ఉంటూ, మానవ హక్కులు పునాదిగా స్త్రీవాదం చర్చకు వస్తుంది.
రంగనాయకమ్మ గారికీ, ఓల్గాకు ఒక విషయం లో మాత్రం అభేదం ఉంది. అదేమిటంటే, వీరిద్దరూ ప్రజా బాహుళ్యం లో ప్రాచుర్యం పొందడం ప్రశంసించే వారి వల్ల కాక, విమర్శించే వారి వల్ల జరిగింది. ఈ సందర్భంగా ‘స్వేచ్ఛ’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓల్గా ఇతర రచనలన్నీ ఒకెత్తు, ‘స్వేచ్ఛ’ ఒకెత్తు. టాగోర్ కి గీతాంజలి ఎలాగో, ఓల్గా కి స్వేచ్ఛ అలా. 1987లో చతుర మాసపత్రిక లో అది ప్రచురితమైంది. ఆ ప్రచురణకి ముందు ఎన్ని తర్జన భర్జనలు జరిగి ఉంటాయా అని ఊహించడానికి నేను చాలా సార్లు ప్రయత్నం చేశాను. అప్పటికే ఆమె ఉషాకిరణ్ సంస్థలో ఉద్యోగి కాబట్టి అది సాధ్యమై ఉండాలి గాని. ఆ రోజుల్లోని ఇతర పత్రికలేవీ ఆ ఇతివృత్తాన్ని ప్రచురించే సాహసం ఖచ్చితంగా చెయ్యవని నాకు బలంగా అనిపిస్తుంది. ‘స్వేచ్ఛ’ ప్రచురణ ఒక రభసకు, రగడకు నాంది. తమని తాము అభ్యుదయవాదులుగా భావించే వారికి కూడా, అది లక్ష వోల్టుల విద్యుదాఘాతం లా తగిలింది. కొందరి ఆవేశం, అక్కసు ఏ స్థాయికి వెళ్ళాయంటే వారు సభ్యతా, సంస్కారాల్ని మరిచిపోయి, చాలా పరుషమైన, కొన్నిసార్లు అసభ్యమైన పదజాలం తో దూషణలకు దిగారు. రంగనాయకమ్మ గారి రామాయణ విష వృక్షం మత విశ్వాసాల అంధత్వాన్ని ప్రశ్నిస్తే, ‘స్వేచ్ఛ’ లో అరుణ కుటుంబ వ్యవస్థ మౌలిక స్వభావం పై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం. ఆ ప్రకంపనలు కొన్ని సంవత్సరాలు కొనసాగాయి. ఆ ఆవేశపూరితమైన వాదోపవాదాలు క్రమేపీ సద్దుమణిగాయంటే అర్థం, ఆ సమస్యలన్నీ పరిష్కారమై పోయాయని కాదు, కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది అని మాత్రమే. అయినా ఒక కొత్త వ్యవస్థ కోసం సమాజం పురుడు పోసుకుంటున్నప్పుడు ఆ మాత్రం నొప్పులు తప్పవు. మార్పుకు ముందు సంఘర్షణ అనివార్యం కదా!
ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, ‘స్వేచ్ఛ’ పై విరుచుకు పడిన వాళ్ళలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ. శతాబ్దాల తరబడి దట్టంగా పేరుకున్న పితృస్వామ్య సాంప్రదాయాల ధూళిని, బానిసత్వపు బూజును తొలగించడం అంత సులభం కాదు మరి. ఊహ తెలిసినప్పటి నుంచి పడవల్లాంటి కార్లు, ఆరడుగుల అందగాళ్ళు, లేదా దేవదాసులు, వారిని కథానాయకుల్ని చేయడమే పరమార్థంగా నడుచుకునే అభిమానవతులైన బాపు బొమ్మలు, ఆ కథలు చదువుతూ ఊహాలోకాల్లో విహరించడానికి అలవాటు పడ్డ పాఠక లోకానికి అరుణను అర్థం చేసుకోవడం, ఆమె నిర్ణయాలతో ఏకీభవించడం, ఆమె నిర్భయంగా చెప్పిన వాస్తవాల్ని జీర్ణించుకోవడం నిజంగానే కష్టం. ‘జానకి విముక్తి’ లో వెంకట్రావు లా, ‘స్వేచ్ఛ’ లో ప్రకాశం తిట్టడు, కొట్టడు, సాధు జీవి ప్రమాణాలకు అచ్చంగా సరిపోతాడు, మరి అలాంటి మొగుడిని ఒదిలెయ్యడం పోయేకాలం కాక మరేమిటి అనేది సగటు పాఠకులకు కలిగే సందేహం. ఈ ‘బాగా చూసుకునే’ భర్తల దృష్టిలో భార్య ‘బాగా మన్నుతున్న వస్తువు’ అని అరుణ తెలుసుకోగలిగింది. అదే  గ్రహింపు మనకూ ఉంటే అన్ని సందేహాలూ పటాపంచలౌతాయి. కుటుంబ వ్యవస్థలో అదృశ్యంగా, అప్రకటితంగా ఉండే హింస, శృంఖలాలు పోలీసు దెబ్బల్లాంటివి, ఆనవాళ్ళు కనబడవు. ఇష్టాఇష్టాలను చంపుకుని మరబొమ్మగా బతుకుతూనే బయటకు నవ్వులు చిందించాల్సిన నిస్సహాయత ఉంటుంది. జీత భత్యాలూ, పదోన్నతులూ, సెలవులూ, సన్మానాలూ, రిటైర్మెంటూ లేని జీవితకాలపు కొలువు ‘గృహిణీ ధర్మం’ అనే గంభీరమైన పేరుతో చలామణి అవుతుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః అన్న సూక్తుల ఘోష వెనక ఎన్ని వినిపించని ఆక్రందనలు, ఎన్ని కనిపించని రక్తాశ్రువులు? వీటిని గుర్తించేదెవరు? సమర్ధించేదెవరు? ప్రతిఘటించేదెవరు? ఈ తత్త్వం బోధపడినప్పుడు అరుణ చెప్పిన ‘స్వావలంబన’ మంత్ర పరమార్థం తలకెక్కుతుంది.
 మెహందీ స్త్రీలతో అరుణ ఒక మాట అంటుంది: “మీకు పోలీసులు మొగుళ్ళు, మాకు మొగుళ్ళే పోలీసులు”. బహుశా ఈ ఒక్క మాట చాలు అరుణ ఆత్మను, ఓల్గా దృక్కోణాన్నీ దర్శించేందుకు.
మరోవైపు, ఇలాంటి నవలలు ఎన్ని వచ్చినా ఒరిగేదేమీ ఉండదు అని పెదవి విరిచే నిరాశావాదులూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే, సమాజం లోని రుగ్మతలకు సంజీవని కనిపెట్టడం, సూచించడం ఓల్గా ఉద్దేశ్యం కాదు. తన రచనల్లో ప్రయోజనం కోసం గాని, పరిష్కారాల కోసం గాని వెతకద్దని ఆమె ముందుమాట లోనే చెబుతుంది. ఆమె ఉద్దేశ్యం నిజాల్ని అన్వేషించడం మాత్రమే, నిర్వచించడం కాదు. అయినా ఒక రచనకు మనుషులను ఆలోచింపజేయడం కంటే ఉన్నతమైన పరమావధి ఏముంటుంది? అలా ఆలోచించడం మొదలెట్టిన అసంఖ్యాకమైన పాఠకులలో నేనూ ఉన్నాను. అందుకుగాను ఓల్గాకూ నేను కృతజ్ఞతలు చెప్పాలి, ఆ ఆలోచనను మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన మీకూ, ఈ వేదికకూ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ధన్యవాదాలు.

Comments

Popular posts from this blog

విముక్త

మా భూమి