విముక్త

విముక్త కథలు చదువుతూంటే నాకు ఒక ఐన్ స్టీన్ కోట్ గుర్తొచ్చింది: We cannot solve problems by applying the same kind of thinking that we used when we created them అని ఆయన హెచ్చరిక. ఏ ఆలోచనా విధానం సమస్యలకు కారణమవుతోందో, దానిని సమూలంగా మార్చుకోనంత కాలం ఆ సమస్యలు అలాగే ఉంటాయి, అదే ధోరణిని ఉపయోగించి పరిష్కారాలు వెతకాలనుకోవడం అమాయకత్వమే కాదు, మూర్ఖత్వం కూడా.

ఓల్గా రాసిన కథలు చదువుతున్నప్పుడు, అందులోని పాత్రలు నన్ను పరధ్యానం లో పడేశాయి, నిద్రలో కూడా వెంటాడాయి, నాలో నాకు అనేకానేక ప్రశ్నలు పరంపరలా వచ్చిపడ్డాయి. విముక్త లాంటి రచనలు అవసరమా? ఇవి చదవాలా? ఇవి అందరి కోసమా, కొందరి కోసమా? ఇవి మేధావి వర్గాన్ని మాత్రమే ఉద్దేశించినవా లేక అమాయకులని మేలుకొలిపేవా? ఈ రచనల లక్ష్యం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? చదివే ఉద్దేశ్యం ఏమిటి – ఇవి కాలక్షేపం కోసమా, పాండితీ ప్రదర్శన కోసమా, చర్చ కోసమా, విప్లవం కోసమా?

విముక్త తత్త్వం నాకు పూర్తిగా బోధ పడిందని నేనంటే అది అబద్ధమైనా అయి ఉండాలి, లేదా అతిశయోక్తి అయినా అయి ఉండాలి, ఈ రెండూ కాకపోతే అపరిపక్వత తో కూడిన ఒక అపోహ అయినా అయిఉండాలి, ఎందుకంటే, ఒక వేళ నాకా తత్త్వం నిజంగానే పూర్తిగా తలకెక్కితే, ఖచ్చితంగా నేనీపాటికి ఇంకా ఇక్కడ ఉండేదాన్ని కాదు. కానీ, ఓల్గా తో ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ, క్రమ క్రమంగా ఒక స్పష్టత ఏర్పడడం నేను గమనించగలిగాను, నన్ను కొత్తగా ముంచెత్తిన ప్రశ్నలన్నిటికీ జవాబులు వచ్చేశాయని అనలేను గానీ దశాబ్దాలుగా నిద్రాణంగా ఉన్న చాలా సందేహాలు పటాపంచలయ్యాయని ధైర్యంగా చెప్పగలను.

ఇది చెప్పాక వెనక్కి తిరిగి చూసుకుంటే, నాకనిపిస్తోంది, ఈ రచనలు అవసరం, చాలా అవసరం, ఇవి చదివి తీరాలి, ఎందుకంటే, స్కూల్ లో, యూనివర్సిటీ లో చదివిన చదువులు నేర్పని విషయాలు, జీవితం పెట్టే పరీక్షల్లో పాస్ అయేందుకు ఉపకరించే విషయాలు తెలుసుకుని తీరాలి కాబట్టి ఇవి అవసరం, మన లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉండడం వల్ల ఏర్పడే అనివార్యమైన ఘర్షణ యుద్ధ రూపం దాల్చకుండా ఆపేందుకు ఇవి అందరికీ అవసరం, తమను తాము మేధావులుగా పొరబడుతూ సంవత్సరాలు దొర్లించే అమాయకుల మొహం మీద నీళ్ళు కొట్టి వాస్తవం లోకి తెచ్చేందుకు ఇవి మరీ అవసరం, ఇవన్నీ చర్చ కోసమో, విప్లవం కోసమో కాదు, కేవలం చైతన్యం కోసం, జాగృతి కోసం, అంతకంటే ముఖ్యంగా సందేహ నివృత్తి కోసం, సుదీర్ఘ కాలం నుంచి మనం ఉపేక్షించిన, లేదా అడగడం మరిచిపోయిన, లేదా అడగవచ్చని తెలుసుకోలేకపోయిన ప్రశ్నల్ని మన మస్తిష్కంలో ముద్రించడం కోసం.

ఈ ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ సమాధానాలు దొరికితేనే లక్ష్యం నెరవేరినట్లు కాదు, ఇవన్నీ సహేతుకమైన, సమంజసమైన సందేహాలేనన్న గుర్తింపే విజయం.

ప్రస్తుత పాఠ్య ప్రణాళికలో ఒకటో తరగతి ఈ వీ ఎస్ లో నేను చూసిన కొన్ని అంశాలు ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అమ్మ. ఇంటి అవసరాలకు డబ్బు సంపాదించేది ఎవరు? నాన్న. ఇవీ మనం మన ఐదేళ్ళ పిల్లల బుర్రల్లో ఎక్కిస్తున్న పాఠాలు. ఏ నలభయ్యో ఏటో సీతా శూర్పనఖల సంభాషణ చూశాక కదా ఆలోచన మారేది (ఒకవేళ మారితే). భార్యంటే సీతలా ఉండాలి, భర్తంటే, కొడుకంటే రాముడిలా ఉండాలి అని వినీ వినీ తలాడించేశాక, రాముడు కైకకు కృతజ్ఞుడై ఉండాలని ఎవరైనా అంటే, రాముడు పురుషోత్తముడు అంటారు కాని నిజానికి చాల బలహీనుడు అని ఎవరైనా అంటే, వివాహం లోపల ప్రేమ లేని శారీరిక సంబంధం ఆమోద యోగ్యం ఐనప్పుడు, వివాహం వెలుపల అలాంటి ప్రేమలేని సంబంధం ఉంటే దాని పట్ల అభ్యంతరం ఎందుకుండాలని ఎవరైనా వాదిస్తే, ఆ తర్కం అర్థం కావడం ఎంత కష్టమో కదా! రావిశాస్త్రి గారూ, జ్వాలాముఖిగారూ కూడా కోప్పడతారు వితండవాదం ఆపమని.

లేదు, ఇది కుతర్కం కాదు అని అవగతం కావాలంటే యుద్ధం చెయ్యాల్సి వస్తుంది, అయితే ఇది బయటి శక్తులతో చేసే యుద్ధం కాదు, మన ఆలోచనలతో, మనం సమ్మతి ఇచ్చి వ్యవహారం పెట్టిన ప్రమాణాలతో, ఏ బంధాలలో మన జీవితాలనీ, అస్తిత్వాన్నీ నిర్వచించుకుంటూ వచ్చామో, ఆ నిర్వచనాలతో యుద్ధం చెయ్యాల్సి వస్తుంది, సీత చేసినట్లు.

పురాణ పాత్రల్ని కథా వస్తువులుగా ఎంచుకోవడం ఓల్గా ఎంచుకున్న ఒక అద్భుతమైన రచనా వ్యూహం, ఎందుకంటే ఇవి మనలో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే పాత్రలు, అరుణ ఏదైనా చెప్తే అవునా కాదా అని ఆలోచిస్తారేమో, అహల్య, సీత చెప్తే అప్పీలేముంటుంది? ఇది కేవలం యధాలాపంగా అనే మాటే, నిజానికి జరిగిందేమిటంటే వాళ్ళ కథలు మనకు ముందే తెలుసు, వారి పట్ల మనకు సానుభూతీ పుష్కలంగా ఉంది, ఇప్పుడు అవే పాత్రల్ని రెండో వైపు నుంచి చూస్తుంటే, ఇన్నాళ్ళూ మనకీ ప్రశ్నలు ఎందుకు తట్టలేదా అనిపించడం చాలా సహజం.

అలాక్కాదు, సీతా, అహల్య ఎంతో సౌమ్యులు, వాళ్ళు ఒక్కనాటికీ అలా మాట్లాడరు, అని ఎవరైనా అనుకుంటే, వాళ్లకి ఈ సౌమ్యుల శక్తిని జ్ఞాపకం చెయ్యాలి, కైక వల్ల కదా దశరథుడు నెగ్గాడు, సత్యభామ సాయం తో కదా కృష్ణుడు నెగ్గింది, రాముడి కంటే ముందు శివధనుస్సు ఎత్తింది సీత మాత్రమే కదా, సీత దూరమయ్యాక కదా, రాముడు మొదటి ఓటమిని రుచి చూసింది! ఇప్పుడు అదే శక్తిని, ఆలోచనని సాధికారత కోసం ఉపయోగిస్తే అందులో ఆశ్చర్యపోవలసింది ఏముంటుంది!

విముక్త కథలలో ప్రస్ఫుటంగా కనిపించే ఒక ముఖ్యమైన పార్శ్వం సంయమనం. ఇందులో ఎక్కడా పురుష ద్వేషాన్ని ప్రబోధించే ప్రయత్నం లేదు, ఉద్రేకం లేదు, కేవలం ఆలోచింపజేసే ప్రయత్నం మాత్రమే ఉంది, అస్తిత్వం కోసం అన్వేషణ ఉంది. ఇందులో ఎక్కడా సీత రాముడిని తిరస్కరించలేదు, ప్రేమని కోల్పోలేదు, భూమి లోకి పయనమైనప్పుడు కూడా అది రాముడి మీద కోపం తో కాదు, తన సత్యశోధన కొనసాగించడం కోసం అంతే.

మిస్టర్ పెళ్ళాం సినిమాలో లక్ష్మి విష్ణువుని స్థానాలు మార్చుకుందామని అడుగుతుంది. ఉత్తరక్షణం లో ఆదిశేషుడి పడగ వైపు కూర్చుని విష్ణువు పాదాలు ఒత్తుతూ కనిపిస్తుంది. ఇంతేగా మార్పంటే. ఇంకో ముచ్చట చూద్దాం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి ఐ లవ్ యు అంటాడు, అమ్మాయి నో అంటుంది, అప్పుడేమవుతుంది, అబ్బాయి అమ్మాయి మీద ఆసిడ్ పోస్తాడు, ఇది మనకు తెలిసిన పాత కథే, సీన్ రివర్స్ చేస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరకు వచ్చి ఐ లవ్ యు అంటుంది, అబ్బాయి నో అంటాడు, అప్పుడేమవుతుంది, అబ్బాయి అమ్మాయి ముక్కు, చెవులు కోస్తాడు, ఇదీ మనకు తెలిసిన పాత కథే. త్రేతా యుగం నుంచి కలి యుగం వరకు పెద్ద మారిందేముంది?

అన్నింటి లోకీ నాకు ఒళ్ళు జలదరింపజేసిన కథ అహల్యది. ఇది కొన్ని వందల సార్లు విన్న కథే. నేనూ చాలా సార్లు ఆలోచించా, అహల్య అలా ఎలా మోసపోయిందా అని, వచ్చినవాడు భర్త కాదని అసలు తనకు తెలుసా, లేదా అని, తను కూడా ఏ అగ్ని పరీక్ష సాయం తోనో తన అమాయకత్వాన్ని నిరూపించుకుని ఉండచ్చు కదా అని, నేనూ అదే చట్రంలో ఉండిపోయా, అంతకు మించి ఆలోచన వెళ్ళలేదు, ఆ చట్రంలో అహల్యకు రెండు ఆప్షన్లే ఉన్నాయి, ఒకటి, తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరాలి, రెండు, తనను తాను డిఫెండ్ చేసుకుని తన శీలాన్ని నిరూపించుకోవాలి, కానీ, ఇప్పుడు అనిపిస్తోంది, అవును, విచారణ అంటేనే అపనమ్మకం కదా, విచారణ అంటేనే అధికార ప్రేరితం కదా, నా శీలం పై సత్యాసత్య నిర్ణయం చేసే హక్కు మీకేముందని ప్రపంచాన్ని ప్రశ్నించడం అనే మూడో ఆప్షన్ కూడా అహల్యకు ఉంది కదా అని. ఈ కథలో నన్ను బాగా కదిలించిన విషయాలు రెండు. ఒకటి, ఏదైతే జరిగిందో అది నాకు తెలిసి జరిగినా, తెలియక జరిగినా గౌతముడి స్పందనలో తేడా ఏమీ ఉండదు అని అహల్య చెప్పడం, ఎందుకంటే, అది భర్త కు ఇవ్వబడ్డ అధికారం, అతడు తీసుకున్న అధికారం, ప్రపంచం అతడికి ఇచ్చిన అధికారం, అహల్య ఇచ్చింది కాదు. రెండు, కథ చివరిలో, నీకు నా గురించిన నిజం చెప్పమంటావా అని అహల్య అడిగినప్పుడు సీత అవసరం లేదు, చెప్పద్దని అనడం, కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని సశేషంగా ఉంచినప్పుడే అవగాహన సంపూర్ణమవుతుంది. నాకు తెలిసిన వాళ్ళలో, నన్ను కలిసిన వాళ్ళలో ఎంతోమందితో నేనిది చర్చించడం నాకు గుర్తుంది, నా మీద పెత్తనం చెలాయించే వాళ్ళు అలా చెయ్యకుండా ఉంటే బావుంటుంది కదా అనుకోవడం, ఒకరి మీద ఒకరు అధికారం చూపించకుండా ఉండడం అసలు కుదురుతుందా అని ఆలోచించడం, ఆ పరిధిలో ఏదైతే నేను గుర్తించలేకపోయానో అది అహల్య కళ్ళకి కట్టినట్టు చెప్పింది, ఎవరికైనా నీపైన అధికారం నువ్విస్తేనే వస్తుంది. ఈ చైతన్యం నుంచి కొత్త ప్రయాణం మొదలవుతుంది, నీ అస్తిత్వం నీ పాతివ్రత్యం కాదు, నీ పిల్లలు కాదు, నీ భర్త ఉద్యోగం, పరపతి కాదు, నీ కుటుంబ గౌరవం కాదు, అని శోషిస్తూ పోగా, నీ తొలి చిరునామా భూమి లోకి చేరేవరకు ఆ ప్రయాణం కొనసాగుతుంది.

మాతృత్వం లోనె ఉంది ఆడ జన్మ సార్థకం, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి లాంటి అనస్తీషియా ఇంజక్షన్లు వందలాది డోసులు ఏళ్ళ తరబడి పడ్డాక కొత్త స్ఫూర్తిని నింపుకోవడం కొంత సమయం తీసుకుంటుంది, సీత, శూర్పనఖల మధ్య స్నేహం సాధ్యమేనని అర్థమైనప్పుడు స్త్రీకి స్త్రీయే శత్రువు అనే సామెతను తయారుచేసింది స్త్రీలు కాదని నిరూపణ అవుతుంది. సత్యం ఎల్లకాలం ఒకలా ఉండదనీ, దాని స్వభావం నిరంతరం పరివర్తన చెందుతుంటుందని తెలిసాక పరిణామం ప్రారంభమవుతుంది. ఈ పరిణామం అధికారం కోసం కాదు, అధికారం ప్రస్తావన లేని సమాజం కోసం, బంధించని బంధాల కోసం. ప్రతి అస్తిత్వాన్నీ గుర్తించి, గౌరవించడమే స్త్రీవాదం అనడంలో ఓల్గా మనోగతం ఇదే.

Comments

Popular posts from this blog

ఓల్గా

మా భూమి