మా భూమి


ఈ రోజు మీతో నా ఆలోచనలు పంచుకునేందుకు నేను ఎంచుకున్న నాటకం ‘మా భూమి’. మా భూమి – ఆ పేరు చెప్తుంటే నాకు సంతోషం, గగుర్పాటు, గర్వం ఒకేసారి కలుగుతున్నాయి. ‘బండెనక బండి కట్టి, పదహారు బళ్ళు కట్టి’ అన్న పాట వినిపిస్తే ఇవాల్టికీ తెలంగాణ బిడ్డల రక్తం ఉప్పొంగుతుంది. 1946 లో, అంటే 73 ఏళ్ళ క్రితం పుట్టిన రెండున్నర గంటల నాటకం నేటికీ సజీవంగా ఉండడం మామూలు విషయం కాదు. ఒక ఇతివృత్తాన్ని సామాన్యుడు own చేసుకున్నపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మరో కారణం ఏమిటంటే అందులో ప్రస్తావించబడిన సామాజిక సమస్యలు కూడా ఇప్పటికీ సజీవం గానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తం గా ప్రజా పోరాటాలకు చిరునామా 20వ శతాబ్దం, ఆ పోరాట గాథల్లో నేటికీ స్ఫూర్తి గా నిలిచే కథల్లో ఒకటి తెలంగాణ లో నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకం గా రైతు కూలీలు చేసిన వీరోచితమైన తిరుగుబాటు. సంఘే శక్తి: అనే సూక్తిని నిరూపించే కథ. చే గవెరా గెరిల్లా పోరాటానికి, అల్లూరి సీతారామరాజు రంపా విప్లవానికి ఏ మాత్రం తీసిపోని వీర గాథ. దురదృష్టవశాత్తు చరిత్ర లోని ఈ పుటలకు రావలసినంత గుర్తింపు రాలేదు. మా భూమి తెలంగాణ రైతాంగ ఉద్యమం నాటి పరిస్థితులను ప్రతిబింబించే కథ మాత్రమే కాదు, ప్రజల్లో పోరాట స్ఫూర్తి నింపి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు బలంగా దోహదం చేసిన నాటకం కూడా. పోరాటం లోంచి సాహిత్యం పుడుతుందా లేక సాహిత్యం వల్ల పోరాటానికి బీజాలు పడతాయా అనే ప్రశ్న వస్తే, రెండూ నిజమే అని చెప్పాల్సిఉంటుంది. ఇది నిరూపించడానికి మా భూమి కంటే గొప్ప ఉదాహరణ లేదు.
మా భూమి నాటకం నేపథ్యం అర్థం చేసుకోవాలంటే అప్పటి చరిత్ర లో అందరికీ తెలియని కొన్ని విషయాల్ని ప్రస్తావించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు తెలిసిన హైదరాబాద్ నగరం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని, అప్పట్లో హైదరాబాద్ రాజ్యం, దీనికే నైజాం సంస్థానం అని కూడా పేరు. ఇది నేరుగా బ్రిటిష్ పాలన లో కాక, నిజాం నవాబుల పాలన లో ఉండేది. నిజాం తాబేదార్లుగా ఉన్న జమీందార్లు, దొరలు, దేశ్ ముఖ్ లు, పట్వారీల మాటే శాసనంగా నడిచే ఒక ఫ్యూడల్ రాజ్యం, పేదల రక్తం పీల్చే భూస్వామ్య వ్యవస్థ, ఇదీ స్థూలంగా అప్పటి నైజాం రాచరిక వ్యవస్థ స్వరూపం. పేరుకి 20వ శతాబ్దమే గాని, సామాజిక లక్షణాలు మధ్య యుగాల నాటి రాక్షస నాగరికతను గుర్తు చేసేలా ఉంటాయి. పండించే వాడికి పట్టెడన్నం దొరకని దుస్థితి, పన్నులు, అప్పులు, వడ్డీలు, వెట్టి చాకిరి, అత్యాచారాలు, నోరెత్తి ప్రశ్నిస్తే చావే గతి, ఇది శ్రమజీవుల జీవన స్థితి. దేశమంతటా స్వాతంత్ర్య సమరం జరుగుతున్న సమయం లోనే హైదరాబాద్ లో దున్నేవాడిదే భూమి అనే నినాదం తో నిజాం పై రైతు కూలీల తిరుగుబాటు మొదలైంది. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ వంటివారు చూపిన దారి బడుగు వర్గాలకు అనుసరణీయమైంది, పాలక వర్గాలకు చెమటలు పట్టించింది. కారం, రోకలి, వడిసెల ఆయుధాలుగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రలో బంగారు అక్షరాలతో రాయాల్సిన అధ్యాయం. 1946 నుంచి 1951 అక్టోబర్ 21 వరకు, ఐదేళ్ళ సుదీర్ఘ కాలం ఆంధ్ర మహా సభ తో పాటు కమ్యూనిస్టుల నేతృత్వం లో ఇది ఉధృతంగా కొనసాగింది. భారత దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వస్తే, హైదరాబాద్ కు మాత్రం 1948 సెప్టెంబర్ 17 వరకు స్వాతంత్ర్యం రాలేదు. అప్పుడొచ్చిన స్వాతంత్ర్యం కూడా సాంకేతిక స్వాతంత్ర్యం మాత్రమే. ఎందుకంటే, హైదరాబాద్ భారత దేశం లో విలీనమయ్యాక, హైదరాబాద్ రైతు కూలీ ల పని పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టైంది, అప్పటి వరకు నిజాం బలగాలతో మాత్రమే పోరాడితే, ఆ తరవాత, వాళ్ళతో పాటు భారత సైన్యం తో కూడా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది బ్రతుకు కోసం జరిగిన యుద్ధం, తిండి కోసం జరిగిన యుద్ధం, నేల కోసం జరిగిన యుద్ధం, అది మానప్రాణాల కోసం జరిగిన జీవన్మరణ పోరాటం.
నాటకాల్లో మూడు తరగతులను గుర్తించడం జరుగుతుంది – సాంప్రదాయిక నాటకం, ఔత్సాహిక నాటకం, ఉద్యమ నాటకం అని. మా భూమి నూటికి నూరుపాళ్ళు ఉద్యమ నాటకం. టాల్ స్టాయ్ నుంచి మార్క్స్ వరకు, లెనిన్ నుంచి మావో వరకు, చే గవేరా నుంచి చారు మజుందార్ వరకు ఎవరు చెప్పినా, రష్యా విప్లవం నుంచి చిన విప్లవం వరకు ఏ కథ చూసినా, ఉమ్మడి అంశం ఒక్కటే – భూమి. 1942 నుంచి కమ్యూనిస్టు భావజాలం తెలంగాణలో బలపడుతూ వచ్చింది. 1946లో తెలంగాణ సాయుధ పోరాటం ఊపిరి పోసుకుంటున్న సమయం లోనే, ప్రజా నాట్య మండలి కళాకారుల ఆధ్వర్యం లో మాభూమి  నాటక ప్రదర్శనలు మొదలయ్యాయి. ఆ తరవాతి సంవత్సరం లో పుస్తక రూపం లో అచ్చయింది. 1948 మే నెలలో రెండో సారి ప్రచురితమైన వెంటనే నిషేధానికి గురైంది, మూలప్రతిని పోలీసులు తగలబెట్టారు. 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్ గా నిజామే ఉండడం వల్ల నిషేధం అలాగే కొనసాగింది. విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత 1957 సెప్టెంబర్ లో తిరిగి మూడో ముద్రణ సాధ్యమైంది. ప్రజల్లో చైతన్యం నింపడం కోసం 1946 నుంచి 48 వరకు రెండు సంవత్సరాల కాలం లో 100 కి పైగా ప్రజా నాట్య మండలి బృందాలు తెలంగాణ అంతటా వెయ్యికి పైగా మా భూమి నాటక ప్రదర్శనలిచ్చాయి. మా భూమి కేవలం తెలంగాణ కు మాత్రమే పరిమితం కాలేదు, ముంబై, పూణే, సోలాపూర్, మద్రాస్ నగరాల్లో కూడా ఇది ప్రదర్శితమైంది. 1996 లో మా భూమి స్వర్ణోత్సవాలు జరిగాయి. నార్ల వెంకటేశ్వర రావు, పింగళి లక్ష్మీకాంతం, గాడిచర్ల హరి సర్వోత్తమ రావు, మునిమాణిక్యం నరసింహా రావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ప్రముఖులతో బాటు సాక్షాత్తూ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రశంసలకు నోచుకున్న మా భూమి 1980లో చలన చిత్ర రూపం లో వచ్చింది. దర్శకుడు రాం గోపాల్ వర్మకి చాలా ఇష్టమైన చిత్రం మా భూమి. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది గాని, నిజం. ఇక్కడ చెప్పుకోవలసిన మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, బెజవాడ గోపాల రెడ్డి మదరాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆయన ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయించుకుని మరీ మా భూమి నాటకాన్ని చూశారు, అద్భుతమైన నాటకం అని పొగిడారు, వెంటనే నిషేధించారు. పాలక వర్గం లో ఉన్నవాళ్ళ మనస్తత్వం అన్ని ప్రాంతాల్లో, అన్ని కాలాల్లో ఒక్క లాగే ఉంటుందని అర్థం చేసుకోవడానికి ఈ సంఘటన ఒక్కటీ చాలు.
మాభూమి నాటక ఇతివృత్తం అప్పటి నల్గొండ జిల్లాలోని 240 గ్రామాల్లో జరిగిన పోరాటానికి సంబంధించినది. అందుబాటు లో ఉన్న గణాంకాల ప్రకారం 8,500 మందిని పోలీసు నిర్బంధించారు, 15,390 మంది హింసకు గురయ్యారు, నిజాం రజాకార్ రక్కసి మూకలు 64 మంది స్త్రీలపై అత్యాచారం చేశాయి, 52 మంది సామాన్యులు ఆత్మార్పణ చేశారు, అప్పటి లెక్కల్లో 12 లక్షల 25 వేల రూపాయల ఆస్తి లూటీ అయింది. ఈ పోరాటమే తమను ఈ నాటక రచనకు పురికొల్పిందనేది రచయితలు స్వయంగా చెప్పిన మాట. నాటకం లో ప్రధాన పాత్రలు వీరా రెడ్డి, అతని భార్య సీతమ్మ, చెల్లెలు కమల, రైతులు దాదా సాహెబ్, సుభాన్, రామి రెడ్డి, గ్రామ పట్వారీ వెంకట్రావు, ఆ ప్రాంతపు దేశ్ ముఖ్ జగన్నాథ రెడ్డి, అతని నౌకరు రాముడు, యల్లమంద అనే గొల్ల, సబ్ ఇన్స్పెక్టర్ అమీన్, చిన్న పాత్రల్లో మరో ఇద్దరు ముగ్గురు పోలీసులు. దేశ్ ముఖ్ దుర్మార్గాలతో కడుపుమండిన ప్రజలు తిరగబడాలని నిర్ణయించుకోవడం, సంఘం గా ఏర్పడడం, వీరా రెడ్డి నాయకత్వంలో లెవీ కట్టము అని తెగేసి చెప్పడం, సంఘాన్ని చెదరగొట్టి తమ అధికారం నిలబెట్టుకోవడం కోసం దేశ్ ముఖ్ చేసే ప్రయత్నాలు, అనేక మలుపుల తర్వాత చివరికి దేశ్ ముఖ్ తన మూకలతో సహా ఊరొదిలి నల్గొండ పారిపోవడం, రైతులు వారి భూముల్లోకి వారు అడుగుపెట్టడం, అంతిమ ప్రజా విజయం, స్థూలంగా ఇవి మా భూమి కథ లోని ఆరు రంగాలలో వివిధ ఘట్టాలు. ప్రాణం బోయినా మా భూమి వదలం, దున్నేవారిదే భూమి హక్కు అనే నినాదాలతో తెర పడుతుంది.
వీరులార, రణ ధీరులార, నిరుపేదలార, ఇదె కదలండోయ్,
పౌరుషమేదో చూపి దేశమును, ప్రజారాజ్యమును నిలపండోయ్,
భూమి లేని రైతేమి రైతురా, భూమిని దున్నే బానిసరా,
బానిస బ్రతుకునకంటె హేయమీ ప్రపంచమున లేనే లేదోయ్
అని పాట వినిపిస్తుంది.
బందగీ సమాధి దగ్గర సంఘం పెట్టుకుంటాం అని రైతులు ప్రమాణం చేయడం తో మొదలైన కథ, తిరిగి బందగీ సమాధి దగ్గర ‘ప్రాణం పోయినా మా భూమి వదలం’ అని ప్రమాణం చేయడం తో ముగుస్తుంది. ఇది కథా శిల్పాన్ని తీర్చిదిద్దడం లో రచయితల నేర్పుకి నిదర్శనం. హిందువులు, ముస్లింలు ఐకమత్యం తో పోరాడడం, స్త్రీలు కూడా పోరాటం లో సమానమైన పాత్ర పోషించడం కథా వస్తువు లో మరికొన్ని విశిష్ట లక్షణాలు.
        కావ్యేషు నాటకం రమ్యం అని చెప్పబడింది. అయితే మా భూమి వంటి నాటకాల లక్ష్యం ప్రేక్షకుల్ని రంజింపజేయడం, ఊహాలోకాల్లో విహరింపజేయడం కాదు. వీటి లక్ష్యం ప్రజలకు వాస్తవాల్ని పరిచయం చేయడం, వారిని చైతన్య పరచడం, ఎవరినైతే మనం సామాన్యులు అంటున్నామో, వారు అసామాన్యులని, చరిత్రని తిరగరాయగల శక్తివంతులని వారికి తెలియజెప్పడం. గురజాడ అప్పారావు గారు జీవించి ఉండి ఉంటే, ఆయన మా భూమి నాటకాన్ని చూడడం జరిగి ఉంటే, ఆయన సంతోషం తో తబ్బిబ్బైపోయి ఉండేవారని ఒక సందర్భంలో గిడుగు సీతాపతి గారు వ్యాఖ్యానించారు. నాక్కూడా ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, మా భూమి నాటకం వ్యాపారం కోసమో, పేరు కోసమో, లేదా ఎవరి ప్రోద్బలం తోనో చేసిన రచన కాదు. ఒకానొక సామాజిక దురవస్థని కళ్ళారా చూసి చలించిపోయిన రచయితల హృదయం లోంచి అప్రయత్నం గా పెల్లుబికిన ఆవేదనకి అక్షర రూపం అది. కళకు సామాజిక ప్రయోజనాన్ని మించిన పరమార్థం లేదని త్రికరణ శుద్ధిగా నమ్మిన వారి కలం నుంచి మాత్రమే ఒక కన్యాశుల్కం, ఒక పాలేరు, ఒక మాభూమి రూపు దిద్దుకోగలుగుతాయి. ఇప్పుడు వారిని ఒక్కసారి స్మరిద్దాం.
        మా భూమి రచయితలు సుంకర సత్యనారాయణ గారు, వాసిరెడ్డి భాస్కర రావు గారు. వీరి పేరుతో సుంకర – వాసిరెడ్డి సాహిత్య పురస్కారం ప్రతి ఏడూ ఇవ్వబడుతోంది. పోతుగడ్డ, గెరిల్లా, వీర కుంకుమ, కాంగ్రెసా – అంగ్రేజా మొదలైన ప్రసిద్ధ ఉద్యమ నాటకాలు కూడా వీరి కలం నుంచి వచ్చినవే. సుంకర సత్యనారాయణ గారి స్వగ్రామం కృష్ణా జిల్లా ఈడుపుగల్లు, వాసిరెడ్డి భాస్కర రావు గారిది ఖమ్మం జిల్లా వీరులపాడు గ్రామం. సుంకర గారు నాటకాల గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం, పొలాల్లోనూ, గొడ్ల పాకల్లోనూ జరిగిందట. మా భూమి రచన కారణం గా సుంకర గారు, వాసిరెడ్డి గారు ఇద్దరూ కూడా చాలా కష్టాలు పడ్డారు, నిజాం ఆగ్రహానికి గురయ్యారు, అరెస్టయ్యారు, కేసుల్లో ఇరుక్కున్నారు, పోలీసు దెబ్బలు తిన్నారు, సుంకర గారు అజ్ఞాతం లోకి వెళ్ళవలసి వచ్చింది, వాసిరెడ్డి గారు చిత్రహింసల పాలయ్యారు, 1948 ఆగష్టు లో విశాలాంధ్ర మాసపత్రికలో ప్రచురితమైన వాసిరెడ్డి గారి ఉత్తరం ఆయన పోలీసుల వల్ల పడ్డ ఇబ్బందుల్ని వివరంగా చెప్తుంది. కానీ, భర్తృహరి చెప్పినట్లు వాళ్ళు ధీరులు, విఘ్న నిహన్యమానులు, ధృత్యున్నతోత్సాహులు, వాళ్ళని పోలీసు దెబ్బలు నిరుత్సాహపరచగలవా?
        మా భూమి నాటకం ప్రజలకు ఇంతగా దగ్గర కావడానికి కారణం రచయితలు ఉపయోగించిన సజీవమైన భాష. ఇందులో ఉపన్యాసాలుండవు, ఊక దంపుడు ఉండదు, ప్రబోధం, భావజాలాలు, సిద్ధాంతాల గోల కనబడదు, గతితార్కికభౌతికవాదం మీమాంస, పాత్రల ద్వారా రచయితల ఆలోచనల్నీ, మేధా సంపత్తినీ ప్రేక్షకుల మీద రుద్దే ప్రయత్నం ఉండదు, కష్టాలుంటాయి, కన్నీళ్లు ఉంటాయి, కడుపు మంట ఉంటుంది, దృఢ నిశ్చయం ఉంటుంది, పాత్రలు మాట్లాడుకునే మాటల్లో పాండిత్యం ఉండదు, జాతీయం ఉంటుంది, నుడికారం ఉంటుంది. రచనలో ఈ సహజత్వం సాధించడం రచయితల  అతి పెద్ద విజయం. వాళ్లకి మాటల మాంత్రికులు అనిపించుకోవాలనే తాపత్రయం లేదు, పాత్రలు సహజంగా మాట్లాడతాయి, వాక్చాతుర్యం చూపించవు. ‘గొర్రె కొవ్వి కొండ మీద తిరగబడిందట’, ‘ఎందుకొచ్చిన నోటి రంకురా బాబూ’, ‘ఆవుల్ని చంపి చెప్పుల్ని దానవిచ్చినట్టు’, ‘చెప్పు తినే కుక్కకి నెయ్యి కూడు ఇముడుతుందా’ లాంటి ప్రయోగాలు రచయితలు ఎంచుకున్న సహజమైన శైలికి కొన్ని ఉదాహరణలు. మా భూమి లో 11 పాటలున్నాయి, అవన్నీ ఈ రోజుకీ తెలంగాణ లో అందరికీ పరిచయమే. “చుట్టుముట్టూ సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ, నువ్వుండేదైదరబాదు, దాన్పక్కన గోలకొండ, గోల్కొండ కిలా కింద, నీ గోరీ కడతము కొడకో నైజాము సర్కరోడ” లాంటి పదాలు ఇప్పటికీ జనాన్ని ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. దొరల దౌర్జన్యాల గురించీ, వెట్టి దుర్మార్గాల గురించీ ఇప్పటి పిల్లలకు పాఠాలు చెప్పాలనుకుంటే చరిత్ర పుస్తకాల కంటే వివరంగా “పల్లెటూరీ పిల్లగాడా, పసులగాసే మొనగాడా, పాలు మరిచి ఎన్నాళ్ళయ్యిందో” లాంటి పాటలు కళ్ళకు కట్టినట్టు చెబుతాయి. గొప్ప గండపెండేరాలు తొడిగించుకుని మహాకవులమని అనుకునేవాళ్ళకెవరికీ ఇలాంటి అచ్చమైన, జాతీయమైన తెలుగు తెలియదని విశ్వనాథ సత్యనారాయణ గారు మా భూమి చూశాక వ్యాఖ్యానించారు. మా భూమి రచయితలు ప్రజలకు చెప్పాలనుకున్న విషయాలు కథా క్రమం లో సంఘటనల ద్వారా చెప్పడం జరుగుతుంది, ఉపన్యాసాలతో కాదు. ఈ సందర్భం లో మా భూమి ని జనం లోకి తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించిన గరికపాటి రాజారావు గారిని కూడా మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి.
        కౌంటర్లు, ప్రాసల వేలం వెర్రిలో పడి కొట్టుకుపోతున్న నేటి చలన చిత్రాల రచయితలూ, దర్శకులూ, నాటక రంగం లో ఉన్న రచయితలూ, కళాకారులూ మా భూమి నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అల్పమైన పదాలతో విస్తృతమైన సామాజిక ప్రయోజనాన్ని సాధించడం అనే ఆదర్శం కథకులు స్వీకరిస్తే వాళ్ళు ప్రపంచానికి ఎంతో మంచి చేసినవాళ్ళవుతారు.
సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర రావు గార్లని తెలుగు సాహిత్య చరిత్ర లో చిరస్మరణీయులుగా నిలబెట్టేందుకు మా భూమి ఒక్కటీ చాలు. కొడవటిగంటి కుటుంబరావు గారు ఒకసారి చెప్పిన మాట – “ఒక వ్యక్తిని ఒక జాతి దీర్ఘ కాలం స్మరిస్తోందంటే, ఆ వ్యక్తి ఒక ఉద్యమాన్ని సాగించి ఉండాలి, లేదా ఆ వ్యక్తి నుంచి ఒక ఉద్యమం పుట్టి అయినా ఉండాలి. వ్యక్తిని సమాజంతో శాశ్వతంగా బంధించగలిగేది ఉద్యమం తప్ప మరేదీ లేదు.” ఈ మాట సుంకర, వాసిరెడ్డి గార్లకు నేరుగా వర్తిస్తాయి. నిజమే కదా, వ్యక్తిని ప్రపంచంతో శాశ్వతంగా బంధించగలిగేది ఉద్యమం మాత్రమే. చావు భౌతిక శరీరానికే పరిమితం, యశః కాయానికి జరా మరణ భయం ఉండదు.
మా భూమి నా దృష్టి లో కేవలం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి, ఒక చారిత్రక సందర్భానికి పరిమితమైన నాటకం మాత్రమే కాదు. అది మానవజాతి సుదీర్ఘ ప్రస్థానం లో మనం మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుని గర్వించే అసంఖ్యాకమైన మైలురాళ్ళలో ఒకటి. శ్రీ శ్రీ గారి మాటల్లో –
తక్షశిలా, పాటలిపుత్రం,
మధ్యధరా సముద్ర తీరం,
హారప్పా, మొహెంజొదారో,
క్రో మాన్యాన్ గుహా ముఖాల్లో
చారిత్రక విభాత సంధ్యల్లో మానవ కథ వికాసపు చిత్రాలివి.
బలహీనులపై బలవంతుల దౌర్జన్యం నడుస్తున్నంత కాలం మా భూమి కథ పునరావృతం అవుతూనే ఉంటుంది. Thank you all!    

Comments

Popular posts from this blog

ఓల్గా

విముక్త